హస్తే లీలాకమలమ్
శ్లోకః
హస్తే లీలాకమలమలకే బాలకున్దానువిద్ధం
నీతా లోధ్రప్రసవరజసా పాణ్డుతామాననే శ్రీః ।
చూడాపాశే నవకురవకం చారు కర్ణే శిరీషం
సీమన్తే చ త్వదుపగమజం యత్ర నీపం వధూనామ్ ॥2.02॥
పదవిభాగః
హస్తే లీలా-కమలమ్ అలకే బాల-కున్ద-అనువిద్ధం నీతా లోధ్ర-ప్రసవ-రజసా
పాణ్డుతామ్ ఆననే శ్రీః । చూడా-పాశే నవ-కురవకం
చారు కర్ణే శిరీషం సీమన్తే చ త్వత్ ఉపగమజం యత్ర నీపం వధూనామ్ ॥2.02॥
అన్వయః
యత్ర వధూనామ్ హస్తే లీలాకమలమ్ అలకే బాలకున్దానువిద్ధం ఆననే లోధ్రప్రసవరజసా
పాణ్డుతామ్ నీతా శ్రీః । చూడాపాశే నవకురవకం చారు కర్ణే శిరీషం సీమన్తే చ త్వత్ ఉపగమజం
నీపం (అస్తి) ॥
ప్రతిపదార్థః
యత్ర = ఎక్కడ
వధూనామ్ = స్త్రీల యొక్క
హస్తే = చేతిలో
లీలాకమలమ్ = విలాసముగా పట్టుకున్న తామరపూవు
అలకే = ముంగురులలో
బాలకున్దానువిద్ధం = అప్పుడే విచ్చిన మల్లెల తురమడము
ఆననే = ముఖములో
లోధ్రప్రసవరజసా = లొద్దుగ పూవుల పుప్పొడితో
పాణ్డుతామ్ = పసుపు-ఎరుపు రంగుల
నీతా శ్రీః = తీసుకురాబడిన సొగసు
చూడాపాశే = కొప్పులో
నవకురవకం = లేత ఎర్ర గోరింట
చారు కర్ణే = అందమైన చెవులలో
శిరీషం = దిరిసెన పూవు
సీమన్తే చ = పాపిట
త్వత్ = నీవలన
ఉపగమజం = జన్మించిన
నీపం (అస్తి) = కడిమ పూవు (ఉంటుంది)
తాత్పర్యమ్
“అక్కడి స్త్రీలు తమ చేతులలో విలాసముగా తామరపూవులు పట్టుకొని ఉంటారు.
ముంగురులలో అరవిచ్చిన మల్లెలు తురుముకుంటారు. లొద్దుగ
పుప్పొడిని రాచుకోవడం వల్ల వారి ముఖాలు పసుపు-ఎరుపు వన్నెలలో
సొగసులీనుతుంటాయి. కొప్పున ఎర్రగోరింటపూవులను, చెవులలో దిరిసెనపూవులను, పాపిట నీ రాకతో పూసిన కడిమిపూవులను
ధరించి ఉంటారు.”
[శరదృతువులో తామరలు, హేమంతములో మల్లెలు,
శిశిరములో లొద్దుగపూలు, వసంతములో ఎర్ర గోరింటలు,
గ్రీష్మములో దిరిసెనపూలు, వానాకాలంలో కడిమి పూలు
పూస్తాయి. అవన్నీ అలకానగరములో అన్ని వేళలలో దొరుకుతాయని సూచన
ఇక్కడ.]
Comments
Post a Comment